Central Govt rules for social media companies, OTTs.

Social media and ott plotforms

దిల్లీ: దేశంలో సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేయకుండా కేంద్రం కట్టుదిట్టమైన నిబంధనలను గురువారం ప్రకటించింది. ట్విటర్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాలతో పాటు ఓవర్‌-ది-టాప్‌ (ఓటీటీ) వేదికలకు మార్గదర్శకాలను వెల్లడించింది.
‘మధ్యంతర మార్గదర్శకాలు, డిజిటల్‌ మీడియా నైతిక స్మృతి, 2021’ పేరిట గెజిట్‌ నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది.

ఈ సంస్థలన్నీ మరింత జవాబుదారీతనంతో వ్యవహరించాలని స్పష్టం చేసింది.
సమాచార నియంత్రణ విషయమై ట్విటర్‌ తో వివాదం తలెత్తిన కొద్ది వారాల్లోనే కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ వ్యవహారాల శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జావ్‌డేకర్‌ లు దిల్లీలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు.

ఇక మీదట అన్ని వ్యవస్థలూ స్వీయ నియంత్రణను పాటిస్తూనే, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాలను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు.
గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, రాజ్యసభలో చర్చ, రాజ్యసభ కమిటీ నివేదికలకు అనుగుణంగా విస్తృత సంప్రదింపుల అనంతరం 2018 డిసెంబరు 24 న దీనిపై ముసాయిదా విడుదల చేసినట్లు మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ తెలిపారు.

దీనిపై వచ్చిన 171 సూచనలు, 80 ప్రతిసూచనలను పరిగణనలోకి తీసుకొని తాజా మార్గదర్శకాలు రూపొందించినట్లు వివరించారు.
సామాజిక మాధ్యమాలను ‘సోషల్‌ మీడియా ఇంటర్మీడియరీ’, ‘సిగ్నిఫికెంట్‌ సోషల్‌ మీడియా ఇంటర్మీడియరీ’ అనే రెండు కేటగిరీలుగా విభజించినట్లు చెప్పారు. రెండో రకం సామాజిక మాధ్యమ వ్యవస్థపై అదనపు నిబంధనలుంటాయి. ఈ కేటగిరీ పరిధిలోకి వచ్చేవి ఎన్ని.? అవి ఏవి.? వంటి వివరాలను త్వరలో ప్రకటిస్తామని మంత్రి తెలిపారు.

ఓటీటీ లకు నిబంధనలు..

నిబంధనల్లో భాగంగా ఓటీటీ, డిజిటల్‌ మీడియా వేదికలు తమ వివరాలు వెల్లడించాలని మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ వివరించారు.
అయితే రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి కాదని, కేవలం వివరాలు మాత్రమే వెల్లడించాలని తెలిపారు.

 • ఓటీటీలూ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. తొలుత ప్రతి సంస్థ భారత్‌ లో అంతర్గత ఫిర్యాదుల పరిష్కార అధికారిని నియమించుకోవాలి. ప్రతి ఫిర్యాదును 15 రోజుల్లోపు పరిష్కరించాలి.
 • రెండో అంచె కింద ఓటీటీ వేదికలు స్వీయ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఇవి ప్రసారం చేసే వాటిని వీక్షకుల వయసును బట్టి 5 కేటగిరీలుగా – ‘యూ (అందరికీ), యూ/ఏ7+, 13+, 16+, ఏ (పెద్దలకు)’ అని వర్గీకరించాలి. చివరి మూడింటికీ ‘పేరెంటెల్‌ లాక్స్‌’ విధానం అమలు చేయాలి. ‘ఏ’ కి సంబంధించి వయసును ధ్రువీకరించిన తర్వాతే చూసే విధానం ఉండాలి.
 • సుప్రీంకోర్టు, హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి లేదా స్వతంత్ర ప్రముఖ వ్యక్తుల నేతృత్వంలో ఆరుగురు సభ్యుల వ్యవస్థను ఏర్పాటు చేసుకుని సమాచార, ప్రసార శాఖ వద్ద నమోదు చేసుకోవాలి. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఓటీటీ సంస్థలు పాటిస్తున్నాయా.? అన్నది ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. ఓటీటీ సంస్థ 15 రోజుల్లో పరిష్కరించని ఫిర్యాదులను ఇది పరిశీలిస్తుంది. ఇలా ఫిర్యాదులను విచారించి తీర్పు వెలువరించినప్పుడు ఒకవేళ సంబంధిత సంస్థది తప్పని తేలిదే అందుకు క్షమాపణలు కోరుతూ ఓటీటీ సంస్థలు స్క్రోలింగ్స్‌ వేయాలి.
 • ఒక ప్రత్యేక పర్యవేక్షణ యంత్రాంగం కూడా ఏర్పాటవుతుంది. స్వీయ నియంత్రణపై సంస్థలు అనుసరించాల్సిన విధి విధానాలను ఇది వెల్లడిస్తుంది. ఫిర్యాదులపై విచారణ కోసం ఇది అంతర్గత కమిటీని ఏర్పాటు చేస్తుంది.
 • డిజిటల్‌ మీడియా వేదికలు అసత్యాలు, వదంతులు ప్రసారం చేయడానికి వీల్లేదు. ఇవి స్వీయ నియంత్రణ పాటించాలి. ఇందులో వార్తలు ప్రసారం చేస్తే ‘ప్రెస్‌ కౌన్సిల్‌’ నియమావళిని అనుసరించాలి.
 • ఐటీ చట్టం కింద ప్రభుత్వానికి దఖలు పడిన అధికారాలను ఉపయోగించి ఈ మార్గదర్శకాలు నిర్దేశించారు. ఓటీటీ నిబంధనలు సమాచార, ప్రసార శాఖ, సామాజిక మాధ్యమాలకు సంబంధించిన విషయాలను ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది.

మార్గదర్శకాల వివరాలివీ..

 • సామాజిక మాధ్యమాలు ఓ అధికారి నేతృత్వంలో ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఆయన పేరును ప్రకటించాలి. వచ్చిన ఫిర్యాదులను 15 రోజుల్లోగా పరిష్కరించాలి.
 • వినియోగదారుల గౌరవ మర్యాదలకు సంబంధించి.. ముఖ్యంగా అసభ్యత, అశ్లీలతలతో కూడిన సమాచారం, చిత్రాలు, వీడియోలు, మార్ఫింగ్‌ ఫొటోలు వంటి వాటిపై ఫిర్యాదులు అందితే వాటిని 24 గంటల్లోగా తొలగించాలి.
 • ప్రముఖ (సిగ్నిఫికెంట్‌) సామాజిక మాధ్యమాలు భారత్‌ లో నివసించే వ్యక్తినే చీఫ్‌ కంప్లయన్స్‌ అధికారిగా నియమించాలి. భారతీయ చట్టాలను అనుసరించే బాధ్యత వీరిదే.
 • 24 గంటలూ చట్టాల్ని అమలు చేసే వ్యవస్థలతో సమన్వయానికి గాను భారత్‌ లో నివాసం ఉండే వ్యక్తిని నోడల్‌ కాంటాక్ట్‌ పర్సన్‌ గా నియమించాలి. వినియోగదారులు చేసే ఫిర్యాదుల పరిష్కారానికి రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ అధికారిని కూడా నియమించాలి. దీనిపై నెలవారీ నివేదిక ప్రచురించాలి.
 • ఏదైనా మోసపూరిత, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే అందుకు బాధ్యులైన తొలి వ్యక్తి ఎవరన్నది గుర్తించి వెల్లడించాల్సిన బాధ్యత ఆయా సామాజిక మాధ్యమాలదే. ఇలాంటి సమాచారం భారత్‌ బయట తయారైతే, దాన్ని దేశంలో తొలుత ఎవరు ప్రవేశపెట్టారన్న విషయాన్నీ వెల్లడించాల్సి ఉంటుంది.
 • దేశ సార్వభౌమత్వం, సమగ్రత, భద్రత, శాంతి భద్రతలు, విదేశాలతో సంబంధాలతో పాటు.. అత్యాచారాలు, లైంగిక వేధింపుల్లాంటి విషయాలకు సంబంధించి మొదట ప్రచారంలో పెట్టిన వ్యక్తుల పేర్లు చెప్పాల్సి ఉంటుంది. ఈ తప్పు చేసిన వారికి 5 ఏళ్లకు పైబడి జైలుశిక్ష ఉంటుంది.
 • ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థలన్నీ భారత్‌ లోని చిరునామాలను తమ వెబ్‌సైట్లు, మొబైల్‌ యాప్‌ లలో వెల్లడించాలి. వినియోగదారుల కోసం స్వచ్ఛంద తనిఖీ యంత్రాంగాన్ని నెలకొల్పాలి. ఏదైనా సమాచారాన్ని తొలగించినా, అందుబాటులో లేకుండా చేసినా ఆ విషయాన్ని సంబంధిత వినియోగదారుడికి ముందస్తుగా తెలియజేసి, కారణాలు చెప్పాలి. దీంతో విభేదించేందుకు అవకాశాన్ని కల్పించాలి.
 • కోర్టులు, ప్రభుత్వ యంత్రాంగాలు నిషేధించిన సమాచారాన్ని పెట్టకూడదు.
 • ప్రముఖ సామాజిక మాధ్యమాలపై కొత్త మార్గదర్శకాలు 3 నెలల్లో ప్రారంభమవుతాయి. ఆ లోపు అవి కొత్త యంత్రాంగాలను ఏర్పాటు చేసుకోవాలి. మిగతా సామాజిక మాధ్యమాలకు మాత్రం ఈ నిబంధనలు నోటిఫై చేసిన నాటి నుంచి వర్తిస్తాయి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s