Complete information about Yadaadri Temple.

నారసింహుడి ఆలయం నల్లరాతి సోయగం
-పునర్నిర్మాణానికి 9.5 లక్షల టన్నుల కృష్ణశిల
కాకతీయ శిల్పకళా వైభవం పునఃసృష్టి
కృష్ణ శిలాద్రి.. యాదాద్రి

పునర్నిర్మాణానికి 9.5 లక్షల టన్నుల కృష్ణశిల
కాకతీయ శిల్పకళా వైభవం పునఃసృష్టి
కృష్ణ శిలాద్రి.. యాదాద్రి
దేశంలోని అన్ని ఆలయాల నిర్మాణశైలితో..
ద్రావిడ శిల్పకళావైచిత్రితో విమాన గోపురం
అష్టభుజి మండపంలో పల్లవ నిర్మాణరీతి
గోపురాలు, మండపాలపై 541 దేవతారూపాలు
800 మంది శిల్పులు.. పది మంది స్థపతులు
సాటిలేని నిర్మాణ నైపుణ్యం.. ఆధ్యాత్మిక శిఖరం
శిలలపై శిల్పాలు.. శిల్పాల్లో ఉప్పొంగే విష్ణుభక్తి
వైభవంగా దివ్యభక్తినగరం ఆవిష్కారం
యాదాద్రి నారసింహుడే శాసించాడేమో.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతోనే.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మదిలో దృఢమైన సంకల్పం కలిగింది. ఒక అపూర్వమైన, అద్భుతమైన కార్యానికి ప్రణాళిక రూపొందింది. యావత్‌దేశంలో ఏ ప్రభుత్వమూ చేయడానికి సాహసించజాలని విధంగా.. అలనాటి రాజులు చూపించిన మార్గంలో సీఎం కేసీఆర్‌ పవిత్రమైన పంచనారసింహక్షేత్రాన్ని అపూర్వమైన దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి పూనుకొన్నారు.

వెయ్యేండ్లపాటు నిలబడే అద్భుతంగా నారసింహుడి దేవాలయం తెలంగాణలో పునరావిష్కృతమవుతున్నది. గోపురాలు, మండపాలు, శిల్పాలు, తోరణాలు, ఒకటేమిటి.. కలడంబోధి కలండు గాలి గలడాకాశంబునన్‌, గుంభినిన్‌ అని బమ్మెర పోతన అన్నట్టు యాదాద్రిపై అణువణువూ తొణికిసలాడుతున్న విష్ణు భక్తి పారవశ్య చిత్రీకరణ ప్రయత్నమే ఈ ప్రత్యేక కథనం.

నభూతో నభవిష్యత్‌.. ఆధునిక కాలంలో అనంద నిలయుడికి అపురూప దేవాలయ నిర్మాణం. అద్భుత దివ్యధామం.. దేశంలో ఏ ఆలయానికీ తీసిపోని విధంగా.. అన్ని ఆలయాల శైలులను పుణికిపుచ్చుకొని.. తనదైన నిర్మాణరీతిలో అనన్యసామాన్యంగా యాదాద్రి నారసింహక్షేత్రం భక్తులకు కనువిందుచేయడానికి దాదాపుగా సిద్ధమైంది. ఆధునిక కాలంలో సంపూర్ణంగా కృష్ణశిలతో రూపొందిన అరుదైన నిర్మాణమిది.

శ్రేష్ఠమైన కృష్ణశిల
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించింది కృష్ణశిల. ఆలయ నిర్మాణానికి కృష్ణశిల శ్రేష్టమైంది. ఏండ్లు గడిచిన కొద్దీ ఈ శిల మరింత పదునుదేలుతుంది. దృఢమవుతుంది. మరింత నాణ్యంగా తయారవుతుంది. ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడం దీని ప్రత్యేకత. వేసవికాలంలో మరీ వేడిగా ఉండకుండా.. చలికాలంలో మరీ చల్లగా ఉండకుండా సమతుల ఉష్ణోగ్రత ఉండేలా చూస్తుంది. ఇప్పటివరకు దాదాపు 9.5 లక్షల క్యూబిక్‌ ఫీట్ల (2.5 లక్షల టన్నులు) కృష్ణశిలను వినియోగించారు. రాష్ట్ర మైనింగ్‌ అధికారులు, ఇతర నిపుణులు దేశమంతటా పర్యటించి నాణ్యమైన కృష్ణశిలను గుర్తించారు. కరీంనగర్‌, బ్రాహ్మణపల్లి, గురుజపల్లిల్లో మాత్రమే దేవాలయాలకు అనుకూలమైన కృష్ణశిల ఉన్నట్టు గుర్తించారు. ఇందులో నాణ్యమైన కృష్ణశిల ప్రకాశం జిల్లా గురుజపల్లిలో లభ్యమైంది. దీంతో అక్కడినుంచే ఆలయానికి కావాల్సిన మొత్తం కృష్ణశిలను సేకరించారు. ఒక దేవాలయ నిర్మాణానికి ఒకే క్వారీ నుంచి రాయిని తీసుకోవడం గతంలో ఎన్నడూ లేదని స్థపతులు చెప్తున్నారు. ఆలయంలో సాలహార విగ్రహాలను కూడా ఈ కృష్ణశిలతోనే చెక్కారు. రాతిని చెక్కినప్పుడు వాటి మొనల వల్ల ప్రమాదం కాకుండా ఉండేందుకు సున్నితంగా.. నునుపుదనంతో ఉండేలా చెక్కారు. యాదాద్రిలో విస్తృతంగా సంచరించే కోతులకు దెబ్బలు తగలకుండా, రాయి గుచ్చుకోకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు.

రాతి నాణ్యతను గుర్తించిందిలా..
ఆలయ నిర్మాణానికి వాడే శిల అంటే వెయ్యేండ్లపాటు చెక్కుచెదరకుండా ఉండాలి. ఇందుకోసం అవసరమైన రాయి నాణ్యతను శాస్త్రీయంగా మదింపుచేశారు. ఎంపిక చేసిన క్వారీల్లోని రాళ్ల నాణ్యతను ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సిమెంట్‌, అండ్‌ బిల్డింగ్‌ మెటీరియల్‌ సంస్థ పరీక్షించింది. రాతితో చెక్కిన శిల్పాల నాణ్యతను మెస్సర్స్‌ సీవెల్‌ ఇంజినీర్స్‌ సంస్థ పరిశీలించింది. ఈ తరహా పరీక్షలను నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి.

శిల్పాల విశిష్టత
విశిష్టాద్వైత, శ్రీవైష్ణవ భక్తి సంప్రదాయానికి వైభవ ఆధ్యాత్మిక దివ్యక్షేత్రంగా యాదాద్రి రూపుదిద్దుకుంటున్నది. దేశంలోని నారసింహ క్షేత్రాల్లోకెల్లా అద్వితీయమైనదిగా అవతరించబోతున్నది. వైష్ణవ భక్తి సంప్రదాయాన్ని జగత్‌మయం చేసిన 12 మంది ఆళ్వార్ల విగ్రహాలు, అష్టభుజి మండపాలు, మాడ వీధులు, పురవీధుల ప్రాకారాలు, పంచతల, త్రితల, పంచతల, సప్తతల, మహారాజ గోపురాలు, విమాన గోపురాలు. ఇలా ఆలయంలోని ప్రతి అణువు విష్ణు తత్వాన్ని ప్రతిఫలించేలా తీర్చిదిద్దారు. యాదాద్రి ఆలయాన్ని దేశంలోని ఏ ఒక్క ఆలయంతోనూ పోల్చి చూడలేము. అన్ని ఆలయాల నిర్మాణ శైలులు యాదాద్రిలో కనిపిస్తాయి. కాకతీయ సామ్రాజ్య వైభవ చిహ్నంగా కాకతీయ రాజుల కళానైపుణ్యాన్ని గుర్తుకు తెచ్చేలా ముఖమండపాలను రూపొందించారు.

గుట్టకు మరో గుట్ట జోడింపు
యాదాద్రి చుట్టూ కలిపి గతంలో 14 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ఇప్పుడు మరో మూడు ఎకరాలను కలిపారు. అప్పటికే ఉన్న గుట్టకు మరో గుట్టను కలిపినట్టు.. ఇది అంత సులువుగా జరుగలేదు. గ్రౌండ్‌నుంచి 80 అడుగుల ఎత్తు వరకు ఉన్న కొండను విస్తరించడమంటే.. కాంక్రీటుతో నింపలేదు. సహజసిద్ధంగా ఉండేలా మట్టితో 80 అడుగుల ఎత్తుతో మూడు ఎకరాల విస్తీర్ణాన్ని పెంచారు. ఇదో మహా యజ్ఞంలా సాగింది.

దేశంలో ఈ తరహా ఒక గుడి ఉన్న కొండను.. దాన్ని సహజసిద్ధతను కోల్పోకుండా ఎక్కడా పెంచలేదు. కేవలం యాదాద్రిలో మాత్రమే ఇది సాధ్యపడింది. ఇందుకు ఏడాదిన్నర సమయం పట్టింది. మట్టితోనే మొత్తం కొండను నిర్మించారు. కొండ కోసం తరలించిన మట్టి, రాళ్లు కూలిపోకుండా గట్టిగా ఉండేందుకు ఎక్కడికక్కడ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కొత్తగా విస్తరించిన కొండభాగం పటిష్ఠతను జేఎన్టీయూ, నిట్‌ నిపుణులు పరీక్షించారు. ఇక చలికాలం, ఎండకాలం కొత్తగా జోడించిన కొండ ఎలా ఉందన్నదాన్ని క్షుణ్ణంగా అధ్యయనంచేశారు. భారీ, అతి భారీ వర్షాలు పడ్డప్పుడు ఎలా ఉన్నదన్నదాన్ని కూడా అధ్యయనం చేశారు. మొత్తంగా రెండు పూర్తి సీజన్లలో వర్షం పడ్డప్పటికీ కొండ చెక్కుచెదరలేదు. గత వానకాలం కురిసిన రికార్డు వానల సమయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు రాలేదు. భారీ వాహనాలు, క్రేన్లు వంటివాటితో కూడా పరీక్షలు జరిపారు. అన్ని పరీక్షల్లో కూడా కొత్త కొండభాగంలో సమస్యలు రాలేదు. కొన్ని వందల ఏండ్ల వరకు ఢోకా ఉండదు. ఆలయ నిర్మాణంపై 2,400 డ్రాయింగ్‌లను సీఎం పరిశీలించి ప్రస్తుత రూపాన్నిఆమోదించారు. స్వామివారి వద్దకు చేరుకునేందుకు రెండు లిఫ్టులను ఏర్పాటు చేశారు. ఆలయ పునర్నిర్మాణమంతా వైటీడీఏ కనుసన్నల్లోనే సాగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రే చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. వైస్‌చైర్మన్‌గా ఐఏఎస్‌ అధికారి కిషన్‌రావు వ్యవహరిస్తున్నారు.

1200 కోట్ల బడ్జెట్‌

ఒక ప్రసిద్ధ ఆలయాన్ని దాని ప్రాశస్త్యం కోల్పోకుండా అద్భుతంగా పునర్నిర్మించడం మాటలు కాదు. ఇందుకు సంకల్పం కావాలి. నిధులు కూడా ముఖ్యమైనవి. యాదాద్రి పునర్నిర్మాణానికి రూ.1800 కోట్లు అంచనా వ్యయంగా భావించారు. కానీ.. అన్నింటినీ సమన్వయం చేసుకోవడంతో దాదాపు రూ.1200 కోట్లకు పరిమితమైంది. జనవరి నెలనాటికి రూ.800 కోట్లు ఖర్చుచేశారు. ఇందులో రూ.250 కోట్లు ప్రధాన ఆలయానికి ఖర్చుచేశారు. భూసేకరణకు ప్రధాన వ్యయం జరిగింది. దాదాపు 1900 ఎకరాలను సమీకరించారు. దీంతోపాటు రోడ్లు, కాటేజీల నిర్మాణం, ల్యాండ్‌స్కేపింగ్‌ వంటివాటికి భారీగానే ఖర్చు చేశారు. యాదాద్రి చుట్టూ ఒక కొత్త ఆధ్యాత్మిక నగరాన్ని నిర్మించారనడంలో అతిశయోక్తి లేదు. రోజుకు 40వేల మంది భక్తులు వచ్చినా ఆటంకాలు ఎదురుకాకుండా ఏర్పాట్లుచేస్తున్నారు. భక్తుల సహకారంతో కాటేజీల నిర్మాణం జరుగుతున్నది. వీఐపీల కోసం నిర్మిస్తున్న కాటేజీలను కూడా అలాగే నిర్మిస్తున్నారు.

అంతా గానుగ సున్నమే

సాధారణంగా ఆధునిక నిర్మాణాల్లో రాళ్ల జాయింట్లను కలపడానికి సిమెంట్‌ వాడుతుంటారు. కానీ.. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ఎక్కడా సిమెంట్‌ వాడలేదు. ప్రాచీన ఆలయ నిర్మాణాల్లో మాదిరిగా గానుగ సున్నం, కరక్కాయ, బెల్లం మిశ్రమాన్ని ఉపయోగించారు. బెంగళూరులోని బ్యూరో వెర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ పరీక్షించి సర్టిఫై చేసింది. ఐఎస్‌ కోడ్‌లకు అనుగుణంగా వీటి పరీక్షలను నిర్వహించారు. పెద్ద జాయింట్ల వద్ద సీసాన్ని (లెడ్‌) కూడా వాడారు. దీనివల్ల జాయింట్ల జీవితకాలం గణనీయంగా పెరుగుతుందని నిపుణుల అభిప్రాయం.

దర్వాజలకు సైతం పరీక్ష
దేవదేవుడి మహామండపంలోకి ప్రవేశించే ద్వారాల వద్ద భారీ దర్వాజలను ఏర్పాటుచేశారు. వీటికోసం వాడిన కలపకు కూడా శాస్త్రీయంగా నాణ్యతాపరీక్షలు నిర్వహించారు. ఇండియన్‌ ైప్లెవుడ్‌ ఇండస్ట్రీస్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐపీఐఆర్టీఐ) బెంగళూరు సంస్థ ఈ పరీక్షలు జరిపింది. కలప దృఢత్వం, మందం, రకం, తేమను తట్టుకొనే లక్షణాలను పరిశీలించారు. అన్నింటిలోనూ ఉత్తమమైన కలపనే దర్వాజలకు వినియోగించారు.

కాకతీయ శైలిలో
ఆళ్వార్ల విగ్రహాలు కూడా కాకతీయ శైలిలోనే కనిపిస్తాయి. విమాన గోపురం ద్రావిడ శిల్పకళావైచిత్రితో కనిపిస్తుంది. అష్టభుజి మండపంలో పల్లవ నిర్మాణరీతి గోచరిస్తుంది. ఆలయంలో 58 యాలీ పిల్లర్లను ఏర్పాటుచేశారు. శిల్పకళ, దేవాలయాల నిర్మాణాల్లో రఘునాథ పాత్రో, ముత్తయ్య స్థపతి, సౌందర్‌రాజన్‌ వంటి నిష్ణాతులు తమ సేవలను యాదాద్రి నారసింహుడి దివ్యధామానికి అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం దేశంలోని అనేక శిల్పకళారీతులను స్వయంగా అధ్యయనంచేశారు. ఆలయ స్థపతులు, ముఖ్య డిజైనర్‌ ఆనందసాయి, వైటీడీఏ వైస్‌చైర్మన్‌ కిషన్‌రావు దేశవ్యాప్తంగా సంచరించి ఆయా ఆలయాల శిల్పరీతులను పరిశీలించి, అధ్యయనంచేసి వచ్చారు. చెన్నై, మహాబలిపురం, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాలనుంచి దాదాపు 800 మంది శిల్పులు యాదాద్రి పునర్నిర్మాణంలో అహోరాత్రులు శ్రమించి తమ నైపుణ్యాన్ని ఆలయ శిలలపై శాశ్వతం చేసుకొన్నారు. దేశంలోనే పది మంది పేరెన్నిక గల స్థపతులు ఈ బృహత్‌యజ్ఞంలో భాగస్వాములయ్యారు.

850 ఎకరాల్లో టెంపుల్‌ సిటీ
ఇప్పుడున్న యాదాద్రికి తోడుగా మరో ప్రాంతాన్ని టెంపుల్‌సిటీగా తీర్చిదిద్దుతున్నారు. 850 ఎకరాలను ఇప్పటికే దీని కోసం సిద్ధంచేశారు. సుమారు వెయ్యి వసతి గృహాలను అక్కడ నిర్మించనున్నారు. 252 కాటేజీలను తొలిదశలో ప్రారంభిస్తారు. ఒక్కొక్కదాన్ని కోటిన్నర విలువతో నిర్మిస్తున్నారు. వీటి డోనర్లు ఏడాదిలో 30 రోజులు ఇక్కడ ఉండవచ్చు. 13.5 ఎకరాల్లో ప్రత్యేకంగా వీఐపీల కోసం 15 కాటేజీలు నిర్మించారు. ఒక్కొక్కదానికి ఏడుకోట్లు వెచ్చించారు. గుట్ట కింద మరో 120 గదులు కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఐదు నక్షత్రాల హోటళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లు, పెండ్లి మండపాలు, దవాఖాన, పాఠశాల.. ఇలా అనేకవాటిని నిర్మించబోతున్నారు. వీటి పనులు కూడా జరుగుతున్నాయి. గుడిపైన విష్ణుపుష్కరిణి ఏర్పాటుచేశారు. ఇక కల్యాణకట్ట, నిత్యాన్నదాన సత్రం, 500 బస్సులు తిరిగేలా బస్‌ టర్మినల్‌ను కూడా నిర్మించారు. యాదాద్రి గుట్టకు చుట్టూ ఉన్న గ్రామాలన్నింటికీ ఆరులేన్ల రహదారిని ఏర్పాటు చేస్తున్నారు. ఇక గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తుల కోసం గుట్ట చుట్టూ 12 ఫీట్లతో రోడ్‌ను ప్రత్యేకంగా నిర్మించారు. 40వేల మంది భక్తులు సులభంగా తిరిగేలా ఇత్తడితో క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ మఠాలవారికి ప్రత్యేకంగా స్థలాలను కేటాయిస్తున్నారు. ఉత్తరాదిపీఠం వారు ఇక్కడ వేదపాఠశాల ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తంచేశారు.

అద్భుతంగా 7 గోపురాలు
యాదాద్రి ప్రధాన ఆలయం వద్ద అత్యంత సుందరంగా.. అద్భుతంగా ఏడు గోపురాలను మలిచారు. నాలుగు దిక్కుల నాలుగు పంచతల గోపురాలను నిర్మించారు. ఒక్కొక్క పంచతల గోపురం ఎత్తు 57 అడుగులు, పశ్చిమం వైపు 85 అడుగుల ఎత్తుతో మహారాజ గోపురాన్ని నిర్మించారు. తూర్పు గోపురం నుంచి ముఖమండపానికి వెళ్లేదారిలో 30.8 అడుగుల ఎత్తులో త్రితల గోపురం ఉంటుంది.

ఇక్కడి నుంచి గర్భగుడిలోకి మార్గం ఉంటుంది. గర్భగుడి నుంచి స్వామివారిని దర్శనం చేసుకొని పశ్చిమ గోపురం నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. సరిగ్గా గర్భాలయంపైన విమాన గోపురం ఉంటుంది. స్వామివారి ప్రధానాలయం రెండో అంతర్‌ ప్రాకారాల వద్ద నాలుగు వైపులా నాలుగు మండపాలను నిర్మించారు. తూర్పు-దక్షిణ భాగంలో రామానుజకూటం ఉంటుంది. స్వామివారి కైంకర్యాల కోసం ఏర్పాటు చేసిన మండపం ఇది. నైరుతివైపు యాగశాల, వాయవ్యంలో అద్దాల మండపం నిర్మించారు. ఈశాన్యం వైపు నిత్యకల్యాణ మండపాన్ని ఏర్పాటుచేశారు. రెండో బాహ్య ప్రాకారం వద్ద నాలుగు దిక్కుల్లో అష్టభుజి మండపాలను నిర్మించారు. స్వామివారి గర్భగుడి ఎదురుగా ఉండే ముఖమండపాన్ని 150 మందికిపైగా కూర్చునేలా తీర్చిదిద్దారు.

నిర్మాణ కమిటీలు
యాదాద్రి నిర్మాణం అంత ఆషామాషీగా జరగలేదు. వాస్తవంగా ఇలాంటి స్థాయిలో దేవాలయాన్ని నిర్మించాలంటే రెండుమూడు తరాలైనా పడుతుంది. అలాంటిది కేవలం అయిదేండ్లలోనే ఆలయ పునర్నిర్మాణాన్ని పూర్తిచేయడం సంకల్పశుద్ధి ఉంటే తప్ప సాధ్యమయ్యేపనికాదు. ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలని తలచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పక్కాగా.. పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగారు. వైటీడీఏ వైస్‌చైర్మన్‌ కిషన్‌రావు, సీఎం కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పలు కమిటీలను ఏర్పాటుచేశారు. వీరిద్దరి సమన్వయంతో ఆలయ పునర్నిర్మాణానికి ఈ కమిటీలు పలు బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాయి.

టెక్నికల్‌ కమిటీ:
బాధ్యతలు: ఇంజినీరింగ్‌ పనులపై సూచనలు, పర్యవేక్షణ, టెండర్ల నిర్వహణ బిల్లుల నిర్ధారణ

సభ్యులు: ఆర్‌అండ్‌బీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌.. రవీందర్‌రావు (చైర్మన్‌), ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ గణపతిరెడ్డి, హెచ్‌ఎండీఏ రిటైర్డ్‌ సీఈ వీ మధ్వరాజ్‌ (సభ్యులు), పంచాయతీరాజ్‌ రిటైర్డ్‌ ఈఎన్సీ ఆర్‌ కొండల్‌రావు, దేవాదాయ శాఖ రిటైర్డ్‌ ఈఎన్సీ బీఎల్‌ఎన్‌ రెడ్డి (కో-ఆప్టెడ్‌ సభ్యులు)

జియో టెక్నికల్‌ కమిటీ:
బాధ్యతలు: ఆలయ పునర్నిర్మాణానికి వాడుతున్న మట్టి, రాళ్లు, కృష్ణశిలల నాణ్యత, వాటి పటిష్ఠత వంటివి పర్యవేక్షణ

సభ్యులు: ఉస్మానియా ఇంజినీరింగ్‌ పూర్వ విభాగాధిపతి, రూర్కీ ఐఐటీకి చెందిన డాక్టర్‌ బాబూరావు, నిట్‌ వరంగల్‌ డైరెక్టర్‌ ఎన్వీ రమణారావు, ఐఐటీ ఢిల్లీకి చెందిన డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, జియో ఫిజిక్స్‌ నిపుణుడు డాక్టర్‌ వెంకట్రావు.

శిల్పకళ పరిశీలన, పనుల పర్యవేక్షణ కమిటీ:
బాధ్యతలు: ఆలయంలోని వివిధ గోడలపై, గోపురాలపై ఏర్పాటుచేసే శిల్పాల పనుల నిర్వహణ

సభ్యులు: డాక్టర్‌ పీ సుబ్రమణి(స్థపతి), టీటీడీ ఆర్కిటెక్చర్‌ విభాగం హెచ్‌వోడీ, డాక్టర్‌ ఈ శివనాగిరెడ్డి (స్థపతి), ది కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ, అండ్‌ అమరావతి సీఈవో, కే దక్షిణామూర్తి (స్థపతి), కే దక్షిణామూర్తి (స్థపతి), ఎక్స్‌పర్ట్‌ ప్యానల్‌ మెంబర్‌ ఆఫ్‌ హిందూ రిలీజియన్‌ అండ్‌ చారిటబుల్‌ ఎండోమెంట్‌.

సమీక్ష కమిటీ:
బాధ్యతలు: పనుల నిర్ధారణ, అనుమతులు, చేసిన పనుల ర్యాటిఫికేషన్‌

సభ్యులు: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చైర్మన్‌), రెవెన్యూ, పురపాలక, ఆర్థిక, దేవాదాయ శాఖ కార్యదర్శులు, కమిషనర్‌ (సభ్యులు), ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ, యాదాద్రి ఆలయ ఈవో, ఆడిటర్‌

(ప్రత్యేక ఆహ్వానితులు), వైటీడీఏ వైస్‌చైర్మన్‌ (మెంబర్‌ కన్వీనర్‌)

రాయి నిర్ధారణ కమిటీ
బాధ్యతలు: యాదాద్రి ఆలయ నిర్మాణంకోసం అవసరమైన కృష్ణశిలను గుర్తించడం. శిలల నాణ్యతను శాస్త్రీయంగా అధ్యయనంచేసి మన్నికైన క్వారీల గుర్తింపు

సభ్యులు: డాక్టర్‌ వేలు (స్థపతి), హరిప్రసాద్‌ (శిల్పి), రాఘవేంద్రరావు (వైటీడీఏ కన్సల్టెంట్‌ ఇంజినీర్‌)

భూసేకరణ కమిటీ
బాధ్యతలు: ఆలయ పునర్నిర్మాణానికి.. యాదాద్రిలో పలు నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ

సభ్యులు: యాదాద్రి భువనగిరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (చైర్మన్‌), భువనగిరి ఆర్డీవో, సంబంధిత మండలాల తాసిల్దార్లు

1800 కోట్లు యాదాద్రి పునర్నిర్మాణానికి అంచనా వ్యయం
1200 కోట్లు సమన్వయ పనితీరుతో పరిమితమైన వ్యయం
800 కోట్లు జనవరి నెలనాటికి ఖర్చు చేసింది
కృష్ణశిల
ఇప్పటివరకు వినియోగించిన కృష్ణశిల దాదాపు 9.5 లక్షల క్యూబిక్‌ ఫీట్లు (2.5 లక్షల టన్నులు) 9.5
ప్రాచీన ఆలయ నిర్మాణాల్లో మాదిరిగా గానుగ సున్నం, కరక్కాయ, బెల్లం మిశ్రమాన్ని ఉపయోగించారు.
541 దేవతారూపాలు
యాదాద్రి వైభవాన్ని వర్ణించడం అక్షరాల్లో సాధ్యమయ్యేపని కాదు. ఒక్కో గోపురంపై.. మండపంపై.. అద్భుత శిల్ప సంపద కన్నులపండువ చేస్తున్నది. దాదాపు 800 మంది శిల్పులు.. ఐదేండ్లు కష్టపడి ఈ దేవతామూర్తులు.. వివిధ పౌరాణిక గాథలకు సంబంధించిన శిల్పాలను సృష్టించారు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s